AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో దొంగలు చొరబడ్డారు. అర్ధరాత్రి అంజన్న ఆలయంలోకి చొరబడ్డ దుండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయ అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన ఆలయంలోని బంగారు నగలతో పాటు, కొన్ని విగ్రహాలను దొంగిలించినట్లు ప్రాధమికంగా గుర్తించారు.

జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయం యాదాద్రి తరువాత ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది. నిత్యం ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. రోజులాగే స్వామి వారి సేవ ముగిసిన తరువాత ఆలయ అధికారులు ప్రధాన ద్వారానికి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి చొరబడి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టినట్లు తెలుస్తుంది. అనంతరం ఆలయంలోని విలువైన బంగారు, వెండి వస్తువులను అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల ఆనవాళ్లను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అలాగే క్లూస్‌ టీంతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ ను కూడా రంగంలోకి దింపాలని పోలీసులు భావిస్తున్నారు.

చోరీ జరగడంతో భక్తులతో పాటు ఎవరిని ఆలయంలోకి పోలీసులు రానివ్వడం లేదు. దొంగతనానికి పాల్పడిన వారు స్థానికుల లేక వేరే ప్రాంతం నుండి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రధాన ఆలయంలో చోరీ జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దేవుని గుడికి రక్షణ లేకపోవడంపై అటు భక్తులు, ఇటు సామాన్యులు అధికారులపై సీరియస్‌ అవుతున్నారు. దొంగతనాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇళ్లు, గుడి అనే తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయంలోని విగ్రహాలు, ఆభరణాలు ఎత్తుకెళ్ళడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10