AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాతబస్తీలో దారుణం..

బైక్‌ రేసర్లను అడ్డుకున్నందుకు కత్తులతో వీరంగం
హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. బైక్‌ రేసింగ్‌ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న ఓ యువకుడిపై దారుణానికి పాల్పడ్డారు. బైక్‌ రేసర్లు అందరూ కలిసి యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలవ్వగా.. పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పాతబస్తీలోని ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. షేజీకి మజీద్‌ సమీపంలో కొంతమంది బైక్‌ రేసింగ్‌ చేస్తుండగా.. స్థానికంగా నివసించే ఓ యువకుడు వారిని అడ్డుకున్నాడు. రోడ్డులపై బైక్‌ రేసింగ్‌ ఏంటీ? అంటూ అభ్యంతరం తెలిపాడు. ఇక్కడ బైక్‌ రేసింగ్‌ చేయకూడదని హెచ్చరించాడు. బైక్‌ రేసింగ్‌ వల్ల వాహనదారులతో పాటు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి విన్యాసాలు రోడ్లపై చేయవద్దని పోకిరీలకు సూచించాడు.

అవసరమైతే ఖాళీ ప్రదేశాల్లో చేసుకోవాలని, రోడ్లపై బైక్‌ రేసింగ్‌లు ఎలా చేస్తారు? అంటూ రేసర్లను ప్రశ్నించాడు. దీంతో బైక్‌ రేసర్లు, యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో యువకుడిపై పోకిరీలు దూసుకెళ్లారు. కత్తులతో అందరూ కలిసి యువకుడిపై దాడి చేసి వీరంగం సృష్టించారు. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న యువకుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. స్థానిక ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10