క్షీణిస్తోన్న ఢిల్లీ మాజీ మంత్రి ఆరోగ్యం
తీహార్ జైలులో (Tihar Jail) ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) బాత్రూమ్‌లో కాలుజారి కిందపడ్డారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన ఆయనను.. చికిత్స కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి సత్యేందర్ జైన్ జైలు బాత్రూమ్‌లో జారిపడ్డారని జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రెండు రోజుల కిందట కూడా సత్యేందర్ జైన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఆయనను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి (Safdarjung Hospital) తరలించిన విషయం తెలిసిందే. జైలులో ఒంటరితనం వల్ల తాను ఆందోళనకు గురవుతున్నట్టు ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలుసార్లు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దిగువ కోర్టులో ఊరట దక్కడకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జైన్ ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు.
కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో గత ఏడాది మే 31న ఈడీ అధికారులు జైన్‌ను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి మాజీ మంత్రి తిహార్ జైలులో ఉన్నారు. ఆయనను ప్రత్యేకంగా ఓ సెల్‌లో ఉంచడం వల్ల ఒంటరిగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనుకు తోడుగా వైద్యుడి సూచన మేరకు కాలక్షేపం కోసం మరో ఇద్దరు ఖైదీలను తన సెల్ లో ఉంచాలని ఈనెల 11న సత్యంద్ర జైన్ లేఖ రాశారు. ఆయన అభ్యర్థన మేరకు నెం. 7 జైలు సూపరింటెండెంట్ ఇద్దరు ఖైదీలను ఆయన సెల్‌కి మార్చారు.
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇద్దరు ఖైదీలను వెంటనే తిరిగి వారి సెల్‌కు తరలించారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండానే సత్యేంద్ర సెల్‌కు ఖైదీలను తరలించడంతో సూపరింటెండెంట్‌పై చర్యలకు ఆదేశించారు.