కేటీఆర్‌వి గూడుపుఠానీ సమావేశాలు.
ఓఆర్ఆర్‌ను సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరిస్తూ వచ్చిందన్నారు. ఓఆర్ఆర్‌ను అగ్గువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారన్నారు. ఇప్పుడు మరో దోపిడీకి తెర తీశారని రేవంత్ ఆరోపించారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ. 7,388 కోట్లలో 738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాలన్నారు. చెల్లించాల్సిన 10శాతం చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారన్నారు.
ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. హడావుడిగా వాయిదాల పద్ధతిలో చెల్లించేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. హెచ్‌జీసీఎల్ ఎండీగా హడావుడిగా బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఓఆర్ఆర్ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఐఏఎస్ అధికారి ఉండాల్సిన పదవిని రిటైర్ అధికారికి ఎందుకు అప్పజెప్పారు. ఐఆర్‌బీ సంస్థ సింగపూర్ కంపెనీకి 49శాతం వాటాకు అమ్మేశారు. కేటీఆర్ సింగపూర్ వెళ్ళినపుడు తేజరాజు, రాజేష్ రాజు ఎక్కడ ఉన్నారు? అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు. కేటీఆర్‌వి గూడుపుఠానీ సమావేశాలు. ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఇవ్వగానే సింగపూర్ కంపెనీ వచ్చింది. ఆ తరువాత షెల్ కంపెనీలు ముందుకొస్తాయి.
షెల్ కంపెనీల వెనక ఉన్న రాజులు ఎవరో, యువరాజులు ఎవరో తేలాలి. ఈ నెల 26 లోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10శాతం నిధులు చెల్లించాలి. సంస్థ టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జరుగుతున్న తతంగంపై అరవింద్ కుమార్ వివరణ ఇవ్వాలి. అరవింద్ కుమార్ నాకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరు? ఆయన కేవలం కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే తాబేదారా? నా పార్లమెంట్ పరిధి చాలా వరకు జీహెచ్ఎంసీలోనే ఉంది. మజెల్స్ సంస్థ నివేదిక తప్పు అని తేలింది.10 శాతం నిధులు చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు? తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి. జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్ విజిలెన్స్ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఇంత దారిదోపిడీ జరుగుతున్నా బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రికి ఎందుకు ఫిర్యాదు చేయరు? బండి సంజయ్ ఓఆర్ఆర్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని ప్రశ్నించారు.