బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం పార్టీలో చేరలేదన్నారు. తన సేవలు ఎక్కడ అవరమైతే.. అక్కడ పార్టీ ఉపయోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ అప్పుడైనా.. ఎప్పుడైనా పదవి కావాలని నోరు తెరిచి అడిగే వ్యక్తిని కానని, తనకు ఏ బాధ్యత ఇవ్వాలనేది ఢిల్లీ నాయకత్వం చూసుకుంటుందని అన్నారు.
బీజేపీ అధ్యక్ష పదవిపై స్పందించిన ఈటల మాట్లాడుతూ బండి సంజయ్ (Bandi Sanjay) మార్పు ఉండకపోవచ్చినని స్పష్టం చేశారు. సంజయ్ తన శక్తిమేరకు పనిచేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలవాలంటే ఇంకా తమ శక్తిని పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. ఢిల్లీ నాయకత్వంతో పాటు… తాము కూడా ఇదే భావిస్తున్నామన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తల బలం పెంచుకోవటంతో పాటు.. ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు రావాలని కోరుకుంటున్నామన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న ఊహాగానాలు తప్పు అన్నారు. జాతీయ పార్టీలో ఢిల్లీ వాళ్ళు ఇక్కడకు రావటం.. మేము ఢిల్లీకి వెళ్లడం సహజమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
రైతుల కొంప ముంచిన ధరణి
తెలంగాణ రాష్ట్రంలో ధరణి లక్షల మంది రైతుల కొంప ముంచిందని బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ‘ధరణిలో ఎన్నో తప్పులు జరిగాయి.నిషేధంలో ఉన్న భూములు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మియాపూర్ స్కాం ఎందుకు బయటపెట్టడడం లేదు?. 111 జీవో పరిధిలో రైతుల వద్ద కంటే, బడా నేతల వద్దే ఎక్కువ భూములు ఉన్నాయి. ఎవరి లాభం కోసం 111 జీవో ఎత్తివేస్తున్నారు. కొత్త సచివాలయంలో ప్రజాప్రతినిధులకు, ప్రజలు అనుమతి లేదు.. మరి ఎవరికోసం సచివాలయం కట్టారు’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.