సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో విశేషంగా రాణించిన ఈ మాజీ చాంపియన్ ఏకంగా పదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఛేదనలో తిరుగులేకుండా ఉన్న టైటాన్స్‌కు పరిస్థితులు అనుకూలించలేదు.
మంచు ప్రభావం లేకపోవడంతో బౌలర్లదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఓడిన టైటాన్స్ శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఎలిమినేటర్ పోరు విజేతతో ఆరోజు తలపడనుంది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 60), కాన్వే (34 బంతుల్లో 4 ఫోర్లతో 40), జడేజా (16 బంతుల్లో 2 ఫోర్లతో 22) రాణించారు. షమి, మోహిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గిల్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), రషీద్ ఖాన్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) మాత్రమే రాణించారు. దీపక్ చాహర్, తీక్షణ, జడేజా, పథిరనకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రుతురాజ్ నిలిచాడు.