రాష్ట్రంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులందరికీ పట్టాలు అందించాలని సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టాలతో పాటు వారికి రైతుబంధు కూడా వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 24న ప్రారంభించి 30వ తేదీలోపు పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటినుంచే చేయాలని అధికారులను ఆదేశించారు.
సచివాయలంలో పోడు పట్టాల పంపిణీపై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకు పోడు పట్టాలను పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. స్వయంగా కేసీఆర్ పోడు పట్టాల పంపిణీని ప్రారంభించడంతో పాటు పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేవరకు పర్యవేక్షించనున్నారు. దీంతో పాటు పట్టాలు అందుకున్న రైతుల పేర్లను రైతుబంధు లబ్ధిదారుల జాబితాలో కూడా చేర్చాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.
ఇతరులకు వచ్చినట్లుగా పోడు రైతులందరికీ రైతుబంధు అందించనున్నారు. ఈ మేరకు ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా పోడు రైతుల పేరిట బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిల్లో రైతుబంధు నగదును జమ చేయనుంది. కొత్త లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులకు అందించి బ్యాంకు అకౌంట్లను వెంటనే తెరవాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కేసీఆర్ సూచించారు. పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజన రైతులందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. ఆ హామీని ఇప్పుడు కేసీఆర్ నెరవేర్చుతుండటంతో పోడు రైతులు ఆనందం వ్యక్తం చేస్తోన్నారు.