హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా జీఎంఆర్ ఎయిర్ పోర్టు నిలిచింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 2023 నెలలో 90.43 శాతం ఆన్-టైమ్ పనితీరును నమోదు చేసినట్టుగా స్పష్టం చేసింది.ప్రపంచంలోనే 90 శాతం మార్కును దాటిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. మార్చి నెలలో 5 మిలియన్లకు పైగా విమానాలను సమీక్షించిన సిరియమ్.. హైదరాబాద్ విమానాశ్రయం ‘గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్’, ‘లార్జ్ ఎయిర్‌పోర్ట్స్’ కేటగిరీలలో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది. కొన్ని సంవత్సరాలుగా, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్తమమైన సేవలందిస్తున్నామని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ జీఎంఆర్ ప్రదీప్ పనికర్ వెల్లడించారు.