రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యంతో టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయ్యి నిరుద్యోగులు రోడ్డున పడ్డారని.. వారికి అండగా ఉండేందుకు ఈ నెల 8న యువసంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రియాంక గాంధీ హాజరుకానున్న ఈ సభకు .. నిరుద్యోగ యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్ వేదికగా నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పడితే తెలంగాణ యువతకు ఉద్యోగులు వస్తాయని అనుకున్నామని .. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వల్ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందని చెప్పారు.
మరోవైపు పంట కొనుగోళ్ల చేయడంలో, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన పంట కొనకపోవడంతో.. అకాల వర్షానికి ధాన్యానికి మొలకలు వచ్చాయన్నారు.రైతులు ఏడుస్తుంటే ప్రభుత్వానికి కనబడటం లేదా? అని నిలదీశారు. కల్లాల్లోకి నీరు చేరి రైతులు గోస పడుతుంటే.. బీఆర్ఎస్ లీడర్లు ఏం పట్టించుకోకుండా ఆత్మీయ సమ్మేళనాలు, ఢిల్లీ టూర్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘మీరు ధాన్యం కొనాలంటే ఏం చేయాలో చెప్పండి.. దండం పెట్టి కొనమని బతిమాలాల? ఒరేయ్ అని తిట్టి వార్నింగ్ ఇవ్వాలా.? ఏం చేస్తే కొంటారు’ అని నిలదీశారు.