సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాల్సిందే
కనీస వేతనాలు అమలు చేయాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్
వీఓఏల సమ్మెకు సంఫీుభావం
ఆదిలాబాద్: సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వీఓఏలు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. సమ్మె శిబిరానికి వెళ్లి వారికి సంఫీుభావం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలీచాలని గౌరవ వేతనం చెల్లించి ఐకేపీ వీఓఏలతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇచ్చే డబ్బులు ఏమేరకు సరిపోతాయని, ప్రభుత్వానికి అసలు సోయి ఉందా అని ధ్వజమెత్తారు. కనీస వేతనం 26 వేలు చెల్లించి వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, పది లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని, ఇతర న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. తనవంతు తక్షణసాయంగా వారికి 25 వేల రూపాయలను ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లు నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగించాలని, తాను అండగా ఉంటానని చెప్పారు.