కేసీఆర్‌ది దిక్కుమాలిన పాలనని, పంటనష్టపోయి రైతులు బాధల్లో ఉంటే వారిని ఆదుకునే చర్యలు చేపట్టకపోవటం దారుణమని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి, మహబూబాబాద్ మండలం మాధవాపురం శివారు దారావత్ తండాలో ఆమె పర్యటించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా, అంతకుముందు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌కు పాలన చేతగాకుంటే రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని హితవుపలికారు. పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా షర్మిల ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.
