రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా లక్మాపూర్లో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, దస్తూరాబాద్లో 44.3, పెద్దపల్లి జిల్లా ఈసాలతక్కెళ్లపల్లిలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 8 జిల్లాలకు మినహా అన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ములుగు జిల్లా గుర్రేపు గ్రామంలో బుధవారం పనికి వెళ్లిన బొగ్గుల చిన్న సమ్మయ్య (60) అనే కూలీ, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ముత్తంపేట గ్రామంలో తన పొలానికి వెళ్లిన దోని రాజులు (70) అనే వృద్ధుడు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. ఆర్టీసీలో ఎండలకు విధులు నిర్వహించలేని డ్రైవర్లు, కండెక్టర్లకు సెలవు ఇవ్వాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వర్రావు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున విధులు నిర్వహించలేని అసహాయ ఉద్యోగులకు ఏప్రిల్, మే నెలల్లో ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.