కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి:గుత్తా
ప్రధాని మోడీ సికింద్రాబాద్ కార్యక్రమానికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు ఏ సంబంధం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. అది అధికారిక కార్యక్రమం అయినప్పుడు.. బండి సంజయ్ ఎంపీగా ఒక ఆహ్వానితుడే అని తెలిపారు. సికింద్రాబాద్ బండి పార్లమెంట్ నియోజకవర్గం కాదని.. కేసీఆర్ కు కుర్చీ వేశాం, శాలువా తెచ్చాం అని బండి సంజయ్ అనడం కరెక్ట్ కాదని చెప్పారు. నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారులు అభివృద్ధి చేశామని కొత్త డ్రామాలాడుతున్నారని.. టోల్ టాక్స్ ల పేరుతో తెలంగాణ నుండి వసూలు అయింది ఎంత..? తెలంగాణకు ఇచ్చింది ఎంత? అని నిలదీశారు. 65వ జాతీయ రహదారిని 2019లోనే 6 లైన్లు చేయాలని..ఇప్పటివరకు ఆ ఊసే లేదని విమర్శించారు.
వాజ్ పేయ్ హయాంలో నల్గొండ-మాచర్ల రైల్వే లైన్ మంజూరైందని, యూపీఏ హయాంలో సర్వేకు కూడా ఆదేశించారని.. కానీ మోదీ వచ్చాక ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.దీనికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారన్నారు.విభజన హామీలు అమలు చేయాలని.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు.
ఎంతసేపు రాష్ట్రప్రభుత్వాన్ని తిట్టడం,తమ నాయకుల గురించి భజన చేయడం తప్పా.. అభివృద్ధి గురించి బీజేపీ పట్టించుకోదని విమర్శించారు.ఓ వైపు జాతీయ సంస్థలు రాష్ట్రానికి పలు రంగాల్లో అవార్డులు ఇస్తుంటే.. ఇక్కడున్న బీజేపీ నేతలు మాత్రం అభివృద్ధి జరగలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు సీఎం పీఠం ఎక్కాలా..? ఎప్పుడు రాష్ట్రాన్ని దోచుకుందామా అనే ఆలోచన తప్ప.. వేరే ధ్యాసే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.రెండు జాతీయ పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు ఉన్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఉన్నఫలంగా మూడు బిల్లులను ఆమోదించారని విమర్శించారు. గవర్నర్ ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రజలకు అనుసంధానంగా ఉండాలని సూచించారు. గవర్నర్ తీరు వల్ల రాష్ట్రంలో పలు కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు.