కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూం తెరిచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం విఫలమైంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నూకపెల్లి శివారులోని వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూం తేరేచెందుకు ఉదయం 10 గంటలకు వచ్చిన అధికారులకు తాళాలు దొరకలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల వద్ద ఉన్న తాళాలతో ప్రయత్నం చేయగా మొత్తం మూడు రూములుకు గాను కేవలం ఒక రూం మాత్రమే తెరచుకున్నట్లు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా తెలిపారు. ఆ రూంలో ఉన్న ఈవీఎంలు, ఇతర సామాగ్రి భద్రంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామని.. కోర్టు నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు.
మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురి 2018 ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. తాళాలు లేవంటూ స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయకపోవడమేంటి అని ప్రశ్నించారు. తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ లో కోర్టు కోరిన డాక్యుమెంట్స్ లేవనీ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కోర్టుకు కూడా వెళ్లతాం అని స్పష్టం చేశారు. ఇది నిర్లక్ష్యమా, ఉద్ధేశ్యపూర్వకంగా జరిగిందో తేటతెల్లం కావాలని డిమాండ్ చేశారు.
కాగా 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపించారు. రీ కౌంటింగ్ కోసం హైకోర్టును కోరారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగినట్లు అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. లక్ష్మణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలని ఆదేశించింది.