AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ … ఒక్కరినీ కూడా గెలవనివ్వను: పొంగులేటి

బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వ: పొంగులేటి

ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాకుండా.. తనలా నష్టపోయిన వందలాది మంది నేతలతో కలిసి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అసెంబ్లీ సీట్లలో… బీఆర్ఎస్ అభ్యర్థులలో ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వనని స్పష్టం చేశారు. 2014, 18 లో వచ్చిన ఒక్క సీటు కూడా దక్కనివ్వనని తేల్చి చెప్పారు. పార్టీలో ఎవ్వరికీ గౌరవం లేదని.. కొద్ది రోజుల్లో అందరూ బయటకు వస్తారని చెప్పారు.

వంద రోజులుగా గుర్తురాని సస్పెన్షన్, జూపల్లి ఖమ్మం రాకతో ఎందుకు గుర్తుకు వచ్చిందని నిలదీశారు. తనను రాజకీయ సమాధి చేయాలని చూసింది నిజం కాదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇస్తానన్న రాజ్యసభ టిక్కెట్ ఏమైందన్నారు.ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో తన వారికి భీ ఫామ్ లు ఎందుకు ఇవ్వలేదన్నారు. తనను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టి, ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా.. కేసీఆర్ ను నమ్మానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు అండగా ఉన్నానని, ప్రతి ఒక్కరికీ ఆర్ధిక సహాయం చేశానని… చివరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సొంత ఊరికి కూడా వెన్నుదన్నుగా నిలిచానని వెల్లడించారు. సిద్ధాంతాల కోసం, తనను ఆశీర్వదించే ప్రజలకోసం ఎంతవరకైనా పోరాడుతానని తెలిపారు.

రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేయవచ్చని..కానీ ప్రజలలో ఉన్న తనను ఏమి చేయలేరని పొంగులేటి అన్నారు.సింగరేణి ఎన్నికలలో 32 రోజులు కొత్తగూడెంలో ఉండి పని చేశానని, మీరిచ్చిన గౌరవం ఏది అని ప్రశ్నించారు.

‘కేసీఆర్ ను తండ్రిలా భావించా.. ప్లీనరీకి2కోట్లు రూపాయలు ఇచ్చా…దక్కిన గౌరవం ఏమిటి?..తెలంగాణ ఉద్యమంలో యోధానుయోధులను ఎలా అగౌరపరిచారో, ఇప్పుడు నాకు అదే జరిగింది.అందుకే నా ప్రజలకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నా.. ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లోనే ఉంటాను. భగవంతుడు తప్పు చేసిన వారందరినీ శిక్షిస్తాడు. కోర్టులు శిక్షలు విధించినా, చివరి కోరికలేమిటని ముద్దాయిలను అడుగుతారు.. కానీ పార్టీల నుండి బయటకు పంపేటప్పుడు మీకు కనీసం విజ్ఞత లేదు’ని విమర్శించారు.నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికి వరదలా వెళ్లాయని.. కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయ్యిందని తెలిపారు.

ANN TOP 10