పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు బీఆర్ఎస్ తీరు ఉందని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు. ఎనిమిదిన్నరేళ్లలో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారని, బంగారు తెలంగాణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తప్పు మీదగ్గర పెట్టుకుని నాపై నిందలేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దాంతాల కోసం ఆఖరి రక్తపు బొట్టువరకూ పోరాడతానని చెప్పారు. ‘పాలేరు ఉప ఎన్నికల్లో విజయం కోసం నాపై ఒత్తిడి తెచ్చారు..కేటీఆర్ నాతో అనేకసార్లు సంప్రదించారు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.. సీఎం మాటలు నమ్మి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరాను.. పాలేరు ఉప ఎన్నికలో కనివినీ ఎరుగని మెజార్టీతో గెలిపించుకున్నా’ అని తెలిపారు. ‘ఆరు నెలల తర్వాత సారు అసలు రూపం తెలుస్తుందని తోటి ఎంపీలు అన్నారు.. కానీ ఐదు నెలల్లోనే తెలిసిపోయిది’ అని చెప్పారు.
