బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన స్పందించారు. తనకు పంజరంలో నుంచి బయటపడినట్లు ఉందని అన్నారు. పార్టీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించక తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని, మూడేళ్లుగా సభ్యత్వం పుస్తకాలు తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యుడిగా ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో ఉన్నానా.. లేదా అనేది తనకే అనుమానం కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త అని, పారదర్శకంగా పరిపాలన చేయడం సీఎం బాధ్యత అని తెలిపారు. కేసీఆర్ తన బాధ్యతను మర్చిపోయి వ్యవహరిస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర నాది, నా ఇష్టమొచ్చినట్టు పాలన సాగిస్తామంటున్నారని… ఇది ప్రజలకు, రాష్ట్రానికి మంచిది కాదని.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజానీకం భాగస్వామ్యం ఉందని.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
