పెండింగ్ బిల్లులపై ఆమోద ముద్ర
ఎట్టకేలకు పెండింగ్ బిల్లులపై ఓ క్లారిటీ ఇచ్చింది రాజ్ భవన్. పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించారు. మరో రెండింటినీ ప్రభుత్వానికే తిరిగి పంపారు.
తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ బిల్లులను గవర్నర్ ఆమోదించారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించారు. ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లులను ప్రెసిడెంట్ పరిశీలనకు పంపారు. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటు బిల్లును గవర్నర్ పెండింగ్ లోనే ఉంచారు.
కొంతకాలంగా ఈ పెండింగ్ బిల్లలు అంశంలో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేధాలు సాగుతున్నాయి. గవర్నర్ బిల్లులను ఆమోదించకపోవడంతో.. గత నెలలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచడం రాజ్యాంగ పరిధిలో లేదని, ఇది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. చీఫ్ జస్టీస్ డీవై చంద్రడూడ్ దీనిపై విచారణ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ కొన్ని బిల్లులను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.