దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో, ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీటిపై 18 శాతం జీఎస్టీ విధించడం పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడం ప్రభుత్వ బాధ్యత. అది సాధ్యం కానప్పుడు, కనీసం ఆ గాలిని శుద్ధి చేసుకునే యంత్రాలనైనా సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంచలేరా?” అని ధర్మాసనం నిలదీసింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. సగటు మనిషి రోజుకు సుమారు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాడని, కలుషిత గాలి పీల్చడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లపై పన్ను తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితి దృష్ట్యా తాత్కాలికంగానైనా పన్ను మినహాయింపులు ఇవ్వడానికి జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోలేరా అని ప్రశ్నించింది.
ప్రస్తుతం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) అనేక ప్రాంతాల్లో 350కి పైగా నమోదవుతోంది. కాలుష్య నియంత్రణ కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP-4) ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పన్నుల తగ్గింపు నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ పరిధిలో ఉంటుందని వివరించారు. దీనిపై తక్షణ స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.








