విశాఖపట్నం నుండి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలు ప్రయాణికులకు వాల్తేర్ రైల్వే అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. కేకే (కోత్తవలస-కిరండోల్) లైన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ రైలు సర్వీసును కొన్ని రోజుల పాటు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 23, 27 మరియు జనవరి 3, 5వ తేదీలలో విశాఖపట్నం – కిరండోల్ (58501) ప్యాసింజర్ రైలు కిరండోల్ వరకు వెళ్లకుండా అరకు స్టేషన్ లోనే తన ప్రయాణాన్ని ముగించనుంది. మళ్ళీ అక్కడి నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు.
సాధారణంగా విశాఖపట్నం నుండి ప్రతిరోజూ ఉదయం 6:45 గంటలకు బయలుదేరే ఈ రైలు.. కొత్తవలస, శృంగవరపుకోట, బొర్రా గుహల మీదుగా ఉదయం 10:55 గంటలకు అరకు చేరుకుంటుంది. అక్కడి నుండి కోరాపుట్, జగదల్‌పూర్ మీదుగా రాత్రి 8:45 గంటలకు కిరండోల్ చేరుకోవాల్సి ఉంటుంది. అయితే పైన పేర్కొన్న నాలుగు రోజుల్లో మాత్రం ప్రయాణికులు అరకు వరకు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది. అరకు అందాలను ఆస్వాదించే పర్యాటకులకు దీనివల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినా, కోరాపుట్ మరియు కిరండోల్ వైపు వెళ్లే నిత్య ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఈ రైలు ప్రయాణం కొండల మధ్య, సొరంగాల గుండా సాగుతూ ప్రకృతి ప్రేమికులకు మరియు పర్యాటకులకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అయితే వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం వంటి సమస్యల వల్ల ఈ మార్గంలో తరచుగా అంతరాయాలు కలుగుతుంటాయి. ప్రస్తుతం చేపట్టిన ఆధునికీకరణ పనుల వల్ల భవిష్యత్తులో రైళ్ల రాకపోకలు మరింత సురక్షితంగా మరియు వేగంగా సాగుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.








