కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ భవిష్యత్తుపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ప్రధాని పదవిని చేపట్టాలని దేశవ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆమె తన నానమ్మ ఇందిరా గాంధీ నుంచి ఎంతో నేర్చుకున్నారని, ప్రజలతో నేరుగా మమేకమయ్యే గుణం ఆమెకు ఉందని కొనియాడారు. రాజకీయాల్లో ఆమె ఎదుగుదల అనివార్యమని, సరైన సమయంలో దేశ ప్రజలే ఆమెను అత్యున్నత స్థానంలో కూర్చోబెడతారని వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన ప్రతిపాదన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసను ప్రస్తావిస్తూ.. “ప్రియాంక గాంధీని ప్రధానిని చేయండి, అప్పుడు ఇందిరా గాంధీలా ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూడండి” అని మసూద్ వ్యాఖ్యానించారు. దీనికి మద్దతుగా రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. ప్రియాంకకు క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురాగల సత్తా ఉందని, అది కేవలం ఆమె ఆకాంక్ష మాత్రమే కాదని, ప్రజలందరి కోరిక అని స్పష్టం చేశారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేదని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందని విమర్శించారు. “రాహుల్ హటావో.. ప్రియాంక గాంధీ లావో” అనే నినాదం ఇప్పుడు కాంగ్రెస్ లోపల నుంచే వినిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రాబర్ట్ వాద్రా కూడా దీనికి ఆమోదం తెలపడం అంటే, గాంధీ కుటుంబం లోపలే నాయకత్వ పోరు ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోందని బీజేపీ విమర్శలు గుప్పించింది.








