హీరోయిన్ల దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో మరియు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో నటుడు శివాజీ స్పందించారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని, అయితే ఆ క్రమంలో కొన్ని అసభ్య పదాలను ఉపయోగించడం పొరపాటేనని ఆయన అంగీకరించారు. ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన వివరణ ఇచ్చారు.
తాను మాట్లాడిన భాషపై వివరణ ఇస్తూ.. తాను పల్లెటూరి యాసలో, గ్రామ భాషలో మాట్లాడానని, ఆ వేగంలో అభ్యంతరకర పదాలు వాడటం తప్పేనని శివాజీ పేర్కొన్నారు. “మహిళలను సమాజం తక్కువగా చూడకూడదనేది నా ప్రధాన ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశాన్ని వివరించే క్రమంలో వాడిన పదజాలం సరికాదని గ్రహించాను. అలాంటి పదాలు వాడకుండా ఉండాల్సింది” అని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు మహిళలందరినీ ఉద్దేశించినవి కావని ఆయన స్పష్టం చేశారు.
అయితే, తన క్షమాపణలోనూ వస్త్రధారణ విషయంలో తన అభిప్రాయాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. హీరోయిన్లు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది వారికే గౌరవమని, వారి మేలు కోసమే తాను ఆ సూచనలు చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం, ఆర్జీవీ వంటి సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో శివాజీ క్షమాపణలు చెప్పడం గమనార్హం.








