వైసీపీ బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. చిన్నపిల్లలతో సైతం “రప్పా రప్పా” అంటూ రాజకీయ ఫ్లెక్సీలు పెట్టించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా చిన్నతనం నుంచే వారిలో నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని ఆమె ఆరోపించారు.
మేకల తలలు నరికి, వాటితో రక్తాభిషేకాలు చేయించే సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి రౌడీ మూకలను అదుపు చేయడం, శాంతియుత వాతావరణాన్ని కాపాడటం ప్రస్తుతం పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారిందని ఆమె పేర్కొన్నారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై జగన్ ఇచ్చిన వార్నింగ్‌లను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని, గతంలో లాగే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు వారికి బుద్ధి చెబుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకోసం ‘ఈగల్ టీమ్’ (Eagle Team) ను ఏర్పాటు చేసినట్లు అనిత తెలిపారు. గంజాయి సాగును దాదాపు సున్నాకు తీసుకొచ్చామని, రవాణా చేసే వారిని కఠినంగా శిక్షిస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఎవరిపై కక్ష సాధింపులకు పాల్పడటం లేదని, నిజంగా కక్ష పెంచుకుంటే వైసీపీ నాయకులు స్వేచ్ఛగా రోడ్లపై తిరగగలిగేవారా అని ఆమె ప్రశ్నించారు.








