AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగ్లాదేశ్‌లో అల్లర్ల జ్వాల: అమెరికా, బ్రిటన్ దేశాల ట్రావెల్ అడ్వైజరీ – అసలేం జరుగుతోంది?

రాడికల్ సంస్థ ‘ఇంక్విలాబ్ మంచ్’ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ హాదీ, తీవ్ర గాయాలతో సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే దేశవ్యాప్తంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. శనివారం (డిసెంబర్ 20) నాడు హాదీ అంత్యక్రియలు ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ముందు జరగనున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ రోజును ‘జాతీయ సంతాప దినం’గా ప్రకటించింది.

పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నిరసనలు, భారీ ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శాంతియుత ప్రదర్శనలు కూడా క్షణాల్లో హింసాత్మకంగా మారే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. అటు బ్రిటన్ కూడా తమ పౌరులు చిట్టగాంగ్ కొండ ప్రాంతాల వంటి ఉద్రిక్తత ఉన్న చోట్లకు వెళ్లవద్దని ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది.

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హాదీ అంత్యక్రియల సందర్భంగా ఢాకా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, అల్లర్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం బంగ్లాదేశ్‌కే కాకుండా, పొరుగున ఉన్న భారత్ సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతున్నాయి.

ANN TOP 10