AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐబొమ్మ విచారణలో సంచలనం: అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి నకిలీ పత్రాల దందా!

తెలుగు సినిమాల పైరసీకి అడ్డాగా మారిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నాంపల్లి కోర్టు అనుమతితో 12 రోజుల కస్టడీలో ఉన్న రవి, కేవలం సినిమాల పైరసీకే పరిమితం కాకుండా, విదేశీ పౌరసత్వం కోసం భారీగా నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ప్రహ్లాద్ అనే పేరుతో రవి సృష్టించిన నకిలీ ఆధార్, పాన్ కార్డులు మరియు డ్రైవింగ్ లైసెన్స్‌ల ద్వారా కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వాన్ని కూడా పొందినట్లు తేలింది. ఈ ‘మిస్టరీ ప్రహ్లాద్’ అసలు వ్యక్తి ఆ లేక రవి సృష్టించిన ఊహాజనిత పాత్ర అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ భారీ పైరసీ సామ్రాజ్య నిర్వహణలో రవికి విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ అనే స్నేహితుడు కీలక సహకారం అందించినట్లు వెల్లడైంది. పదో తరగతి నుంచే రవికి మిత్రుడైన ప్రసాద్, థియేటర్లలో విడుదలైన హెచ్‌డీ సినిమాలను ఎలా పైరసీ చేయాలి, వాటిని వెబ్‌సైట్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి అనే సాంకేతిక అంశాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే పోలీసుల విచారణలో ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఐబొమ్మ సర్వర్ల నెట్‌వర్క్ మరియు సుమారు 110 కంటే ఎక్కువ డొమైన్ల ద్వారా జరుగుతున్న దందాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. రవి అడ్మిన్‌గా వ్యవహరిస్తూ సుమారు 21,000 పైగా సినిమాలను పైరసీ చేసినట్లు ఆధారాలు లభించాయి.

బీఎస్సీ కంప్యూటర్స్ చదివి వెబ్ డిజైనింగ్‌లో ఆరితేరిన రవి, అమెరికా, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి సర్వర్లను నడిపిస్తూ పోలీసులకు సవాల్ విసిరాడు. తనను ఎవరూ పట్టుకోలేరని గర్వంగా ప్రకటించిన రవి, చివరకు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో కుకట్‌పల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో పట్టుబడ్డాడు. ఈ దందా ద్వారా రవి సుమారు రూ. 20 కోట్లు సంపాదించినట్లు అంచనా వేస్తుండగా, పోలీసులు ఇప్పటికే రూ. 3 కోట్లను సీజ్ చేశారు. ఈ అంతర్జాతీయ పైరసీ ముఠాలో ఉన్న మరికొందరు కీలక సభ్యులను పట్టుకుంటే, టాలీవుడ్‌ను పీడిస్తున్న ఈ భూతం మూలాలను పూర్తిగా తుడిచిపెట్టవచ్చని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10