AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భూకబ్జాలపై ఉక్కుపాదం: రాజకీయ నేతల జోక్యం సహించేది లేదు.. కలెక్టర్లకు చంద్రబాబు, పవన్ సీరియస్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను వేధిస్తున్న భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్ల సదస్సులో భాగంగా విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో జరుగుతున్న భూ దందాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. భూ వివాదాల్లో ఏ పార్టీ నేత జోక్యం చేసుకున్నా ఉపేక్షించవద్దని, అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) కింద కేసులు నమోదు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

ముఖ్యంగా లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెడుతున్న 22A జాబితా భూముల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్తం చేశారని, దానివల్లే ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం భూముల గురించే ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి ఈ సమస్యలపై స్పష్టమైన పురోగతి ఉండాలని, జాయింట్ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి నేరుగా రైతుల ఇళ్లకే పంపేలా వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. లింక్ డాక్యుమెంట్లు కూడా డేటా వేర్‌హౌస్‌లో భద్రపరచాలని, రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా నేరుగా యజమానులకే డెలివరీ కావాలని చెప్పారు. 30 ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్న పేదలకు తక్షణమే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచిస్తూ, ఏపీని భూ వివాద రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ANN TOP 10