తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి కీలక గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,702 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 7,527 స్థానాల్లో, కాంగ్రెస్ రెబల్స్ 808 చోట్ల విజయం సాధించారని ప్రకటించారు. వెరసి 8,335 పంచాయతీల్లో (సుమారు 66 శాతం) కాంగ్రెస్ జెండా ఎగురవేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫలితాలు రెండేళ్ల తమ ‘ప్రజా పాలన’కు ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేరు.. ఆయన అడ్డా గజ్వేల్‌లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది” అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒక్క ఎన్నికలో కూడా గెలవలేకపోయిందని విమర్శించారు. అధికారం కోల్పోయినా ప్రతిపక్ష నేతలకు అహంకారం తగ్గలేదని, అసూయతో ప్రభుత్వం చేసే మంచి పనులను అడ్డుకోవద్దని హితవు పలికారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణా, గోదావరి జలాల అంశంపై కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సూటిగా సవాల్ విసిరారు. “కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా లేఖ రాస్తే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపించాయని, గెలిచిన సర్పంచ్‌లు డిసెంబర్ 22న బాధ్యతలు స్వీకరిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు.









