AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాయకుడు అంటే ఇలా ఉండాలి: సీఎం అడిగిన వెంటనే రోడ్డు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన శరవేగంగా సాగుతోంది. తాజాగా మంగళగిరిలో జరిగిన నూతన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బాబురావు అనే గిరిజన యువకుడు కానిస్టేబుల్‌గా ఎంపికై, వేదికపై తన నియామక పత్రాన్ని అందుకునే సమయంలో.. తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాడు. సొంత గ్రామం గురించి ఆలోచించిన ఆ యువకుడిని సీఎం మనస్ఫూర్తిగా అభినందించారు.

యువకుడి విజ్ఞప్తిపై స్పందించిన చంద్రబాబు, వెంటనే పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైపు తిరిగి.. “డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి ఆ గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత మీదే” అని స్టేజిపైనే కోరారు. గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ పెంచాలని పవన్ కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారని, బాబురావు కోరికను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి నిమిషాల్లోనే అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సభ ముగిసేలోపే అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, తెనుములబండ గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి అధికారులు అంచనాలు సిద్ధం చేయగా, పవన్ దానికి తక్షణమే ఆమోదం ముద్ర వేశారు. అంతేకాకుండా, ఈ రోడ్డు పనులు నేటి నుంచే ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల పవన్ స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ANN TOP 10