రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సహా ఇతర బ్యానర్లపై సుమారు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ సొంతం చేసుకుంది. సమాచారం ప్రకారం, థియేట్రికల్ హక్కుల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 18 మిలియన్ డాలర్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విడుదలకు దాదాపు 40 రోజుల ముందే అమెరికా, కెనడాలలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించారు. ప్రీమియర్ షోల కోసం ఒక్క టికెట్ ధర 20 లేదా 25 డాలర్లుగా నిర్ణయించారు. జనవరి 9 నుంచి 11 వరకు జరిగే ప్రదర్శనలకు 18 లేదా 20 డాలర్లు, ఆ తర్వాతి రోజులకు 14 లేదా 17 డాలర్లు టికెట్ ధరగా ఉంటాయి. ఈ టికెట్ ధరలు కేవలం తెలుగు వెర్షన్‌కు మాత్రమే వర్తిస్తాయని డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేశారు.









