ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ వద్ద యూదుల పండుగ వేడుకలపై జరిగిన ఉగ్రదాడిలో బిగ్ ట్విస్ట్ బయటపడింది. ఈ దాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులలో ఒకడైన తండ్రి, సాజిద్ అక్రమ్ (50) వద్ద భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నట్లు, దాని సాయంతో నవంబర్‌లో అతను ఫిలిప్పీన్స్‌కు పర్యటనకు వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ పొందినట్టు అధికారులు గుర్తించారు. అతను 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియాకు వెళ్లాడని, 2001లో పార్ట్‌నర్ వీసా, 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా పొందాడని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సాజిద్ ఐరోపాకు చెందిన మహిళ వెనరా గ్రోసాను వివాహం చేసుకుని, కుమారుడు నవీద్ అక్రమ్ (24) మరియు కుమార్తెను కలిగి ఉన్నాడని, వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని చెప్పారు.
సాజిద్ గత 25 ఏళ్లలో కేవలం ఆరుసార్లు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాడని, 2022లో టోలిచౌక్‌లోని తమ ఆస్తులను అమ్ముకోడానికి వచ్చాడని డీజీపీ వివరించారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకాం చదివాడని, అయితే ఇక్కడ అతనిపై ఎటువంటి క్రైమ్ రికార్డులు లేవని డీజీపీ స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 16 మంది మృతిచెందగా, 36 మంది గాయపడ్డారు.









