ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీ ట్రిప్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీని ప్రధాని సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా మోదీ నయా లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఖాకీ ప్యాంట్, కామోఫ్లాజ్ టి-షర్ట్, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.
దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్ వెళ్లారు. ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో కనిపించిన ఏనుగులను ప్రధాని చూశారు.