తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డు రద్దు కాకూడదనుకుంటే, డిసెంబర్ 31వ తేదీలోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయాలని స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా పదేపదే చెబుతున్నప్పటికీ చాలా మంది కార్డుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాఖ అధికారులు ఈ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు, రాయితీలను పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మనిషికి నెలకు ఇరవై కిలోల సన్నబియ్యం వంటి ప్రయోజనాలన్నింటికీ రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటారు. కాబట్టి, ఈ-కేవైసీ పూర్తి చేయనివారికి జనవరి నెల నుంచి రేషన్ కట్ చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు.
ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఖచ్చితంగా రేషన్ దుకాణాలకు వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. ఈ-పాస్ (e-Pass) యంత్రంలో బయోమెట్రిక్ నమోదు కావడం లేదని కొందరు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి గడువును పెంచుతూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ నెల 31 లోపు ఈ-కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే జనవరి నెలలో రేషన్ లభిస్తుంది.









