నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబర్ 31న స్టార్ హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌లు, బార్‌ల నిర్వాహకులు వేడుకల నిర్వహణకు కనీసం 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. సెలబ్రేషన్స్‌కు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.
పోలీసులు జారీ చేసిన ముఖ్య మార్గదర్శకాల ప్రకారం: వేడుకల ప్రాంగణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాల నిఘా ఉండాలి, మైనర్‌లకు ప్రవేశం పూర్తిగా నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలలోపు ఆపివేయాలి. ఇండోర్ ఈవెంట్లకు మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు పరిమిత శబ్దంతో అనుమతి ఉంటుంది. బాణసంచా కాల్చడం, సామర్థ్యాన్ని మించి పాస్‌లు/టికెట్లు జారీ చేయడం, అసభ్య ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడం పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా, నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీస్ శాఖలు కలిసి పబ్‌లు, బార్‌లు, అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నాయి. డ్రగ్స్ గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా వినియోగిస్తారు. అలాగే, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపడతామని, మద్యం సేవించిన వారు తప్పనిసరిగా డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.









