విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి వెంకటేశ్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
వెంకటేశ్ యొక్క కొత్త పోస్టర్‌లో, ఆయన చాలా స్టైలిష్‌గా మరియు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి దిగి, గన్‌మెన్ల పహారా మధ్య నడిచివస్తున్న ఆయన లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ పోస్టర్ ప్రకారం, వెంకటేశ్ పాత్ర ఈ సినిమాలో పవర్‌ఫుల్‌గా ఉండటంతో పాటు, ఆయన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.









