మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న తన బావ డాక్టర్ డిగ్రీలను అక్రమంగా వాడుకొని.. అభినవ్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక మెడికల్ కాలేజీలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. ఈ బాగోతంపై అభినవ్ సింగ్ సొంత సోదరి డాక్టర్ సోనాలిసింగ్ ఉన్నత వైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో మోసం బయటపడింది. దీంతో అప్రమత్తమైన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు.
మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అభినవ్ సింగ్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న తన బావ డాక్టర్ రాజీవ్ కుమార్ గుప్తా సర్టిఫికేట్లు, పేరును దుర్వినియోగం చేస్తూ.. అభినవ్ సింగ్ 2022లో జిల్లాలోని ఒక మెడికల్ కాలేజీలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. నాలుగేళ్ల పాటు ఆయన డాక్టర్ రాజీవ్ కుమార్ గుప్తాగా చలామణి అవుతూ.. రోగులకు వైద్యం అందించాడు. అయితే ఇంతకాలం పాటు ఏ ఒక్కరూ అతడు వైద్యుడు కాదనే విషయాన్ని గుర్తించకపోవడం గమనార్హం.
ఈ అక్రమంపై అభినవ్ సింగ్ అక్క డాక్టర్ సోనాలి సింగ్ ఉన్నత వైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉన్న తన భర్త డాక్టర్ రాజీవ్ కుమార్ గుప్తా సర్టిఫికెట్లు, పేరు దుర్వినియోగం చేసి అభినవ్ స్పెషలిస్ట్ డాక్టర్‌గా పని చేస్తున్నాడని డాక్టర్ సోనాలి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మయాంక్ శుక్లా.. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ సోనాలి ఫిర్యాదు మేరకు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈ కేసును పరిశోధించడానికి ఒక ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేశారు.









