ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్, విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిని సమీక్షించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో రాబోతున్న డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సుందర్ పిచాయ్‌ను కోరారు. ఇది అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుందని లోకేష్ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.
నారా లోకేష్ తన పర్యటనలో భాగంగా ఇతర ప్రముఖ టెక్ దిగ్గజాలతోనూ చర్చలు జరిపారు. ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో సమావేశమై, ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని, రాజధాని అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా ప్లాన్ చేయాలని కోరారు. అనంతరం, ఎన్ విడియా ప్రతినిధి రాజ్‌మిర్ పురితో భేటీ అయి, రాష్ట్రంలో ఎన్ విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని, భాగస్వామ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో మంత్రి లోకేష్ సమావేశమై, ఏపీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆ తర్వాత, జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగంతో భేటీ అయి, ఏపీలో జూమ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నారా లోకేష్ చేసిన ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ చర్చలు రాష్ట్రంలో ఐటీ, ఏఐ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడతాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.









