AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పరకామణి కేసులో సంచలనం: ఐటీ, ఈడీ విచారణకు హైకోర్టు ఆదేశం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో జరిగిన చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. గతంలో ఈ చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు, ఆ రాజీ చెల్లదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 16కు వాయిదా పడింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐడీ మరియు ఏసీబీ తమ దర్యాప్తును కొనసాగించవచ్చు. ముఖ్యంగా, అక్రమంగా రాజీ చేయడం వంటి అంశాలపై సీఐడీ విచారణ కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే, దర్యాప్తులో వెల్లడయిన సమాచారాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కూడా అందించాలని హైకోర్టు సూచించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయంలో రంగంలోకి దిగితే, పరకామణి కేసు వెనుక ఉన్న పెద్ద తలల వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ప్రధాన నిందితుడు, పెదజీయరం మఠం క్లర్క్ రవికుమార్ అక్రమాస్తులపై జరుగుతున్న దర్యాప్తును కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని హైకోర్టు డైరెక్ట్ చేసింది. అంతేకాకుండా, ఫిర్యాదుదారు అయిన మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సూపరింటెండెంట్ ఆఫీసర్ (ఏవీఎస్‌వో) సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి వివరాలు, శవపరీక్ష నివేదికను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. ఈ నివేదిక దర్యాప్తులో కీలకమైనదని, రహస్యంగా ఉంచాలని హైకోర్టు పేర్కొంది.

ANN TOP 10