ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రగతి పథంలోకి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు 10.91 శాతంగా నమోదైందని, ఇది ఇదే కాలానికి జాతీయ సగటు 8.8 శాతం కంటే గణనీయంగా అధికమని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక రంగం గాడిలో పడిందని, పారిశ్రామిక రంగంలో 12.20 శాతం, సేవల రంగంలో 11 శాతం, వ్యవసాయ రంగంలో 11.43 శాతం బలమైన వృద్ధి నమోదైందని ఆయన స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల పాలనతో ప్రస్తుత వృద్ధిరేటును పోల్చి చూశారు. 2014-19 మధ్య టీడీపీ పాలనలో జీఎస్‌డీపీ వృద్ధి 13.49 శాతంగా ఉండగా, 2019-24 మధ్య గత ప్రభుత్వ పాలనలో ఇది 10.32 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఈ వృద్ధి పతనం కారణంగా రాష్ట్రం సుమారు రూ.7 లక్షల కోట్ల జీఎస్‌డీపీని నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే తలసరి ఆదాయాన్ని జాతీయ సగటు రూ.2,05,324 కంటే పెంచి రూ.2,66,240కి చేర్చగలిగామని ఆయన గుర్తుచేశారు.
భవిష్యత్ లక్ష్యాలను వివరిస్తూ, 2025-26 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 17.11 శాతం వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ వృద్ధిరేటు కొనసాగితే, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.292 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం రూ.49 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయంలో మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో రికార్డు స్థాయిలో 26.27 శాతం వృద్ధి, పారిశ్రామిక రంగంలో మైనింగ్, తయారీ, నిర్మాణ రంగాలలో 11 శాతానికి పైగా వృద్ధి స్థిరమైన ప్రగతికి సంకేతాలని ఆయన తెలిపారు.









