ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ నిత్యం ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణలో కూడా హాట్ టాపిక్‌గా ఉంటున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా, కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో వేడిని పెంచాయి. ఈ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారు పవన్ క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలు ఆడనివ్వబోమంటూ హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
పవన్ కల్యాణ్ తన హిందుత్వ ఎజెండా స్టాండ్‌ను కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ ఆయన పదేపదే డిమాండ్ చేస్తున్నారు. దేశంలో హిందువులను చులకనగా చూస్తున్నారని, మత విశ్వాసాల కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుప్పరన్ కుండ్రంలో కార్తీక దీపం వెలిగించడంలో అడ్డంకులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువులు తమ దేశంలో ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు రావాలని ఆకాంక్షిస్తూ పవన్ చేసిన ట్వీట్‌లు రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపాయి.
రాష్ట్ర రాజకీయాలపై పవన్ స్పందిస్తూ, వైసీసీ మళ్లీ అధికారంలోకి రానే రాదంటూ పదే పదే ప్రకటిస్తున్నారు. 2029లో మళ్లీ పవర్‌లోకి వస్తామని కలలుకంటున్న వైసీపీకి కౌంటర్ ఇస్తూ, రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’ అంటూ వైసీపీకి పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ కావాలనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారా? లేక ఆయనకున్న ఇమేజ్ కారణంగా ప్రతీ మాట చర్చకు దారితీస్తుందా? అనేది పక్కన పెడితే, సేనాని రూటే సెపరేటు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









