కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ ఆల్-రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ, కేకేఆర్‌తో తన బంధాన్ని కొనసాగిస్తూ, ఫ్రాంచైజీ అతడిని తమ జట్టుకు ‘పవర్ కోచ్’గా నియమించింది. రాబోయే వేలానికి ముందు రసెల్‌ను విడుదల చేయడం, అతడికి కొత్త బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న కారణాలను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వివరించారు.
రసెల్‌ను ఆటగాడిగా విడుదల చేయడం వెనుక ప్రధాన కారణం ఆర్థిక వ్యూహమే అని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పష్టం చేశారు. రసెల్ కాంట్రాక్ట్ విలువ రూ. 12 కోట్లు అయినప్పటికీ, నిబంధనల ప్రకారం అతడిని అట్టిపెట్టుకుంటే తమ వేలం పర్సు నుంచి రూ. 18 కోట్లు తగ్గుతాయని తెలిపారు. వేలంలో రూ. 18 కోట్లు చాలా పెద్ద మొత్తం అని, ఆ డబ్బుతో జట్టును మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుందని మైసూర్ పేర్కొన్నారు. రస్సెల్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్న విషయంపై జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో చర్చించినప్పుడు, ఆయనే అతడికి ‘పవర్ కోచ్’ పాత్రను సూచించినట్లు మైసూర్ వెల్లడించారు.
ఆటగాడిగా కెరీర్ ముగిశాక భవిష్యత్తు గురించి రసెల్ ఆందోళన చెందకుండా ఉండేందుకు షారుఖ్ ఖాన్ ఈ నిర్ణయాన్ని సమర్థించారని మైసూర్ తెలిపారు. రస్సెల్ పవర్ హిట్టింగ్, డెత్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఉన్న నైపుణ్యాలను గౌరవిస్తూ ‘పవర్ కోచ్’ అనే పాత్రను కేకేఆర్ సృష్టించింది. 2014 నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన రస్సెల్, తన ఐపీఎల్ కెరీర్‌లో 140 మ్యాచ్‌లు ఆడి 2,651 పరుగులు, 123 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.









