తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా శబరిమల యాత్ర పూర్తి చేసుకుని, రామేశ్వరం దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి.
ప్రమాద వివరాల ప్రకారం, అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారును రామనాథపురం సమీపంలో రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తుండగా, ఒక లారీ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో జరిగింది. మృతి చెందిన నలుగురిని విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. వారిలో ముగ్గురు దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలసకు చెందిన వంగర రామకృష్ణ (51), మార్పిన అప్పలనాయుడు (33), మరాడ రాము (50) కాగా, మరొకరు గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావు (35)గా గుర్తించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, హోంమంత్రి వంగలపూడి అనిత సహా ఇతర మంత్రులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని, మృతదేహాలను త్వరితగతిన కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.









