వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సుదీర్ఘ మీడియా సమావేశంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నాలుగు గోడల మధ్య మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డి ఏం సాధించారు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక, బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
మంత్రి కొల్లు రవీంద్ర జగన్ రెడ్డిని విమర్శిస్తూ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వారిని దేవతామూర్తిగా, జోగి రమేశ్ లాంటి వారిని గొప్ప వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక, తిరుమల పరకామణిలో స్వామివారి హుండీ కొట్టేసిన వారిని వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేసిన వారిని, గంజాయి సరఫరా చేసే వైసీపీ నాయకులను జగన్ సమర్థించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. “మద్యం ద్వారా రూ. 3,500 కోట్లు అవినీతికి పాల్పడిన మీరు మద్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది” అని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తాము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామని, సూపర్ సిక్స్ పథకాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి తమ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ, 64 లక్షల మందికి పింఛన్లు, ‘తల్లికి వందనం’ ద్వారా రూ. 10 వేల కోట్లు, ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 6,310 కోట్లు అందించామని తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, తుఫాన్ నష్టానికి హెక్టార్‌కు రూ. 25 వేలు అందిస్తున్నామని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్ ఈ ప్రెస్ మీట్ పెట్టారని ఆయన హెచ్చరించారు.









