AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతిలో కాస్మోస్ ప్లానెటోరియం… నిర్మల, చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కాస్మోస్ ప్లానెటోరియం’ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రిచంద్రబాబు సమక్షంలో శుక్రవారం ఏపీ సీఆర్డీఏ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరిగింది. ఈ ఒప్పందంతో రాజధాని నగరంలో విజ్ఞాన, వినోద రంగాలకు సంబంధించిన ఓ అద్భుతమైన నిర్మాణం రూపుదిద్దుకోనుంది.

 

ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ‘పూర్వోదయ’ పథకం కింద రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలపై ఆమె ప్రశంసలు కురిపించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పథకం కింద రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ప్రకాశంతో పాటు ఉత్తరాంధ్రలోని మరో నాలుగు జిల్లాల అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ఈ 9 జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.39 వేల కోట్ల అంచనాతో సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాంతంలో పండిన ఉద్యాన ఉత్పత్తులను ముంబై, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించేందుకు బ్యాంకులు చొరవ చూపాలని నిర్మలా సీతారామన్ సూచించారు. మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి పంట రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఎలా తరలివెళుతున్నాయో ఉదహరించిన ఆమె, అదే తరహాలో ఏపీ రైతులకు కూడా మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు.

 

కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ వంటి అనుబంధ పరిశ్రమలకు కూడా రుణసాయం అందించి రైతుల ఆర్థిక ప్రగతికి తోడ్పడాలని జాతీయ బ్యాంకులకు దిశానిర్దేశం చేశారు. దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు. ఇదే సమయంలో రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బ్యాంకులపై ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

ANN TOP 10