రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం మంగళగిరిలో నూతనంగా నిర్మించిన ‘నూర్ మసీద్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మతం ఏదైనా మానవత్వాన్ని ఎన్నడూ మరవకూడదని, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని కీలక వ్యాఖ్యలు చేశారు. యువత భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్ర, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, 2019లో దేవుడు తనకు కఠినమైన పరీక్ష పెట్టాడని, చాలామంది ఎగతాళి చేసినా, దేవుడు ఇచ్చిన శక్తి, పట్టుదలతో ధైర్యంగా కష్టాలను ఎదుర్కొన్నానని లోకేశ్ అన్నారు. క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని యువతకు స్ఫూర్తినిచ్చారు. యువత చదువుపై దృష్టి సారించి, భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయం మేరకు 2047 నాటికి దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని లోకేశ్ కోరారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం నైతిక విలువలు, ముఖ్యంగా మహిళలను గౌరవించడం చాలా అవసరమని అన్నారు. ప్రజలు తన పనిని గుర్తించినప్పుడే తనకు కొండంత బలం అని, అందరికీ అండగా ఉంటూ, కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దామని ఆయన స్పష్టం చేశారు.








