AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిగాచీ పేలుడు కేసు: “54 మంది చనిపోయిన ఘటన చిన్నదేమీ కాదు” – పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలోని పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో 54 మంది కార్మికుల ప్రాణాలను బలిగొన్న పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరును తెలంగాణ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇంత పెద్ద దుర్ఘటన జరిగి నెలలు గడుస్తున్నా దర్యాప్తు పూర్తి కాకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

“ఇది సాధారణ ప్రమాదం కాదు. 54 మంది చనిపోయిన ఘటన చిన్నదేమీ కాదు. ఇంతటి ఘోరంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పడం దారుణం,” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, “ఇప్పటికే 237 మంది సాక్షులను విచారించినా పురోగతి ఏది? పేలుడుకు బాధ్యులైన వారిని ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదు?” అని నిలదీసింది.

ఇంతటి తీవ్రమైన ఘటనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయకపోగా, కేవలం డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తిస్థాయి నివేదికను వెంటనే సమర్పించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే, తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.

ANN TOP 10