మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి, కడపకు చెందిన సోమవరపు సురేంద్ర అలియాస్ ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను తనను తాను వ్యాపారాలు ఉన్న వ్యక్తిగా నమ్మబలికి మహిళల నుంచి డబ్బు, బంగారం తీసుకుని పలుచోట్ల అదృశ్యమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతనిపై పలువురు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ మోసాల పరంపర వెలుగులోకి వచ్చింది. సురేంద్ర మ్యాట్రిమోనీ సైట్లలో ఆకర్షణీయమైన ప్రొఫైల్స్‌ను పెట్టి మహిళలకు పరిచయం అయ్యేవాడు.
సురేంద్ర తన మోసాల ద్వారా విజయవాడ, ఖమ్మం ప్రాంతాల మహిళలను పెళ్లి పేరుతో మోసగించి భారీ మొత్తాలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి కేసులో, భువనగిరికి చెందిన ఒక మహిళను క్రైస్తవ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం చేసుకొని ఆమె నుంచి రూ. 15 లక్షలు మరియు 30 తులాల బంగారం తీసుకున్నాడు. పెళ్లి తర్వాత కుటుంబ పత్రాలు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో అనుమానం వ్యక్తమై, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సురేంద్రను కడపలో అరెస్ట్ చేశారు. విచారణలో సురేంద్ర అప్పటికే కడపలో మరో మహిళను కూడా పెళ్లి చేసుకుని జీవిస్తున్నట్లు బయటపడింది. నిందితున్ని రిమాండ్‌కు తరలించిన పోలీసులు, మ్యాట్రిమోనీ మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు పూర్తిగా పరిశీలించి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.









