AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాన్సీ నంబర్: వేలంలో రూ. 1.17 కోట్లు పలికిన HR88B8888

ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన కార్ల కోసం అంతకంటే నచ్చిన వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకోవడం చాలా మందికి ఒక హాబీ. తాజాగా, హర్యానా ఆర్టీఏ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఒక ఫ్యాన్సీ నెంబరు ఏకంగా రూ. 1.17 కోట్లు పలికి, దేశంలోనే అత్యంత ఖరీదైన వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త రూ. 45.99 లక్షలకు ‘KL 07 DG 0007’ నంబరును దక్కించుకోగా, ఇప్పుడు దానికి రెండు రెట్లు అధిక ధర పలికిన ఈ నంబర్ రికార్డులను బద్దలు కొట్టింది.

హర్యానా రవాణా శాఖ వీఐపీ లేదా ఫ్యాన్సీ నెంబర్లకు వారం వారం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తుంది. ఈ వారం నిర్వహించిన వేలంలో ‘HR88B8888’ నెంబరుకు భారీ ధర పలికింది. ఈ నంబరు కోసం మొత్తం 45 దరఖాస్తులు రాగా, దీని ప్రారంభ ధర రూ. 50 వేలుగా నిర్ణయించారు. అయితే, దీనిని సొంతం చేసుకోడానికి జరిగిన పోటీలో బిడ్ ధర కోట్లు దాటింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు సమయం ముగియగా, ఒక కారు యజమాని ఏకంగా రూ. 1.17 కోట్లకు ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇది రూ. 88 లక్షలుగా ఉండటం గమనార్హం.

‘HR88B8888’ అనే నంబర్‌ ప్రత్యేకంగా ఉండటానికి కారణం, పెద్ద అక్షరంలో ఉన్న ‘B’ కూడా ‘8’ లా కనిపించడమే. దీనివల్ల మొత్తం నంబర్ ఒక వరుస ఎనిమిదుల్లా కనిపిస్తుంది. అదనంగా, ఒకే అంకె (8) పునరావృతం కావడం వల్ల ఇది అరుదుగా, ఆకర్షణీయమైన నంబర్‌గా మారుతుంది. ఇది కేవలం ఫ్యాన్సీ నంబరు మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది.

ANN TOP 10