AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పైరసీ కేసులో ఐబొమ్మ రవి మరోసారి అరెస్ట్: కస్టడీ పిటిషన్‌పై కోర్టు విచారణ

సినిమాల పైరసీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి మరో షాక్ తగిలింది. తాజాగా, మరో కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్‌సైట్‌లలో కొత్త కొత్త సినిమాలను పైరసీ చేసి అప్‌లోడ్ చేస్తున్న ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలులో ఉన్న ఇమ్మడి రవిని పీటీ వారెంట్ జారీ చేసి సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఇమ్మడి రవిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఇమ్మడి రవిపై 5 కేసులు నమోదు అయినట్లు తెలిసింది. మరోవైపు, ఇమ్మడి రవి తరఫు న్యాయవాదులు ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రానుంది.

మరోవైపు, గత విచారణలో ఇమ్మడి రవి నుంచి సరైన సమాధానాలు రాలేదని, మరింత లోతైన దర్యాప్తు కోసం మరోసారి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టును అభ్యర్థించారు. మరో 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇమ్మడి రవిని ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌పై కోర్టు రేపు (గురువారం) విచారణ జరపనుంది.

ANN TOP 10