ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలో మహిళలను కించపరిచేలా, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న ధోరణులకు అడ్డుకట్ట పడాలని తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆడపిల్లల్లా ఏడవద్దు’, ‘గాజులు తొడుక్కున్నావా’ వంటి అవమానకరమైన మాటలను సమాజం నుంచి పూర్తిగా తొలగించాలని ఆయన హితవు పలికారు. ఈ దుష్ప్రచారాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నేటి ఆడపిల్లలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’ (మాక్ అసెంబ్లీ) కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం మొదటి నుంచి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి, మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశానని, విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారి ప్రగతికి తోడ్పడ్డానని వివరించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మన పౌరులకు అందించిన గొప్ప ఆయుధమని ఆయన కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి (నరేంద్ర మోదీ) ప్రధాని కావడం, గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కావడం వంటి అద్భుతాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా ఇచ్చిందని, కొందరు హక్కుల కోసం పోరాడతారు కానీ బాధ్యతలను విస్మరిస్తారని చంద్రబాబు అన్నారు. చట్టసభలకు వ్యక్తిగత కక్షల కోసం కాకుండా ప్రజాహితం కోసం రావాలని సూచించారు. విద్యార్థులు మంచి, చెడులను విశ్లేషించుకునే శక్తిని పెంపొందించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ త్వరలోనే ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, ‘వికసిత్ భారత్’, ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను కలిసికట్టుగా సాధిద్దామని పిలుపునిచ్చారు.









