AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన: వాకింగ్‌కు వెళ్లి ఇబ్బంది పడ్డాను

దేశ రాజధాని ఢిల్లీలోని వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ కాలుష్యం వల్ల తాను కూడా ఇబ్బందిపడ్డానని ఆయన తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల నిత్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంగళవారం ఉదయం తాను గంటసేపు వాకింగ్‌కు వెళ్లానని, ఆ సమయంలో తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయని సీజేఐ వెల్లడించారు.

వాయు నాణ్యత సూచీలు దారుణంగా పడిపోవడం, కాలుష్య తీవ్రత వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో, 60 ఏళ్లకు పైబడిన న్యాయవాదులు వ్యక్తిగతంగా కోర్టుకు రావడానికి బదులుగా వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సైతం ఈ వ్యాఖ్యలతో ఏకీభవించి, అరవై ఏళ్ల వయస్సులో కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీంతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, తాను కూడా ఇబ్బందిపడుతున్నానని వారి వ్యాఖ్యలకు మద్దతు పలికారు.

సుప్రీంకోర్టు విచారణలను వర్చువల్ మోడ్‌కు మార్చడానికి బార్ అసోసియేషన్ అంగీకరిస్తే, కోర్టు ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని సీజేఐ తెలిపారు. ఇప్పటికే రెండు వారాల క్రితం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం కూడా ఢిల్లీ కాలుష్యంపై న్యాయవాదులను హెచ్చరించింది. కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు న్యాయవాదులు స్వయంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని, వర్చువల్ హియరింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

ANN TOP 10